శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులునౌరాయనగా
ధారాళమైననీతులు
నోరూరగ చవులువుట్ట నుడివెద సుమతీ!
పద్య అర్థం: సుమతీశతక కారుడు ‘సుమతీ’ అని సంబోధన చేసి బుద్ధిమంతులకు మాత్రమే నీతులను చెప్పెదనని తెలిపినాడు. లోకములో నీతి మార్గమును ఆచరించి బోధించిన శ్రీరాముని అనుగ్రహము పొందిన వాడనై లోకులు మెచ్చుకొను నట్టి… మరలమరల చదువ వలెను అనే ఆశ కలుగునట్లుగా వచించుచున్నానని ఈ పద్యం యొక్కం భావం.
కొఱగాని కొడుకుపుట్టిన
కొఱగామియె కాదు తండ్రి గుణములు చెరచున్
చెఱకు తుద వెన్ను పుట్టిన
చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతీ!
పద్య అర్థం: ప్రయోజకుడు కాని కొడుకు పుడితే, అతడు ప్రయోజకుడు కాకపోవటమే కాకుండా, తండ్రిలో ఉన్న సుగుణాలకు చెడ్డపేరు తీసుకువస్తాడు. చెరకుగడ చివర కంకి మొలిస్తే, మొలిచిన చోట తీపి ఉండదు. అక్కడ లేకపోవటమే కాక, గడలో ఉన్న తీపినంతటినీ కూడా ఈకంకి చెడగొడుతుంది. ఇది ప్రపంచమంతటా ఉన్న సత్యం.
నడువకుమీ తెరువొక్కట
కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
పద్య అర్థం: మంచిబుద్ధిగలవాడా! ఎవరో ఒకరు పక్కన తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు. శత్రువు ఇంటికి వెళ్లినప్పుడు, తినడానికి ఏవైనా పదార్థాలను స్నేహంగా పెట్టినప్పటికీ ఏమీ తినవద్దు. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువునూ తీసుకోవద్దు. ఇతరుల మనసుబాధపడేలాగ మాట్లాడవద్దు. పూర్వం ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే అడవులు దాటి వెళ్లవలసి వచ్చేది. అలాగే శుభ్రంచేసిన దారులు కూడా తక్కువగా ఉండేవి. అందువల్ల పాములు, క్రూరమృగాలు, దోపిడీదొంగలు – వీరి బాధ ఎక్కువగా ఉండేది. ప్రజలందరూ గుంపులుగా ప్రయాణాలు చేసేవారు. ఒంటరిప్రయాణం మంచిది కాదు.
లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!
పద్య అర్థం: మంచిబుద్ధికలవాడా! శరీర బలం ఉన్నవాని కంటె తెలివితేటలు ఉన్నవాడు అందరికంటే బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసి దానిమీదకు ఎక్కగలడు. కండలు తిరిగి, శరీరం దృఢంగా ఉండిబలవంతులైనవారు చాలామంది ఉంటారు. అలాగే బాగా చదువుకుని తెలివితేటలు సంపాదించుకున్న నీతిమంతులు కూడా ఉంటారు.
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ!
పద్య అర్థం: మంచిబుద్ధికలవాడా! తనకు శక్తి ఉంది కనుక, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు. వారు ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లాడతారు. అందువల్ల వారికి మంచి కలుగదు. ఎంతోబలం ఉన్న పాము అన్నిటికంటె చిన్నప్రాణులైనచీమలకు దొరికిపోయి, ప్రాణాలు పోగొట్టుకుంటుంది.
వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలోసుమతీ!
పద్య అర్థం: మంచిబుద్ధికలవాడా! ఎవరు ఏమి చెప్పినా దానిని శ్రద్ధగా వినాలి. అయితే విన్న వెంటనే తొందరపడి ఒక నిశ్చయానికి రాకూడదు. బాగా ఆలోచించి తెలుసుకొని, ఆ చెప్పిన విషయం అసత్యమో, సత్యమో అని ఎవరు తెలుసుకుంటారో వారు నీతి తెలిసినవారు.
సిరిదా వచ్చిన వచ్చును
సరసంబుగ నారికేళ సలిలము భంగిన్
సిరిదా పోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
పద్య అర్థం: ఓ బుద్ధిమంతుడా! ఎవరికైనా సరే సంపదలు ఏ విధంగా వస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఎలాగంటే కొబ్బరికాయలోకి తియ్యటి నీళ్లు ఎక్కడి నుంచి ప్రవేశిస్తాయో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ధనం అదేవిధంగా వస్తుంది. అలాగే వెలగపండులో ఉన్న గుజ్జు మాయమైపోయి కాయ మాత్రం చక్కగాఉంటుంది. బయట నుంచి చూస్తే అది గుజ్జు నిండిన కాయలాగే ఉంటుంది. ఎక్కడా రంధ్రం కాని పుచ్చుకాని ఉండదు. అయితే అందులోకి కరి అనే ఒకరకమైన పురుగు చేసి లోపల ఉన్న గుజ్జు తినే సి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతారు. కరి అనే ఒకరకమైన వ్యాధివచ్చినప్పుడు లోపల గుజ్జు పోతుందని మరికొందరు చెప్తారు. ఏది ఏమైనా వెలగపండులో ఉన్న గుజ్జు మాత్రం పూర్తిగా ఖాళీ అయిపోతుంది. అదేవిధంగా ఒకవ్యక్తి దగ్గర నుంచి ధనం కూడా అలాగే వెళ్లిపోతుంది. ఇందులో బద్దెన లోకంలో ఉన్న వాస్తవాన్ని తీసుకుని ధనంఎలావచ్చిపోతుందో వివరించాడు. నారికేళమంటే కొబ్బరికాయ, సలిలమంటే నీరు, కరి అంటే ఏనుగు, భంగిన్ అంటే విధంగా అని అర్థం.
అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బాఱని గుర్రము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!
పద్య అర్థం: ఓబుద్ధిమంతుడా! కష్టాలలో ఉన్నప్పుడు సహాయపడని బంధువును తొందరగా దూరం చేసుకోవాలి. అలాగే ఆపదలు కలిగినప్పుడు, మొక్కుకున్నప్పటికీ దేవతలు కరుణించపోతే, ఆ దేవతను పూజించటం వెంటనే మానేయాలి. అలాగే యుద్ధాలలో ఉపయోగించటం కోసమని రాజుల వంటివారు గుర్రాలను పెంచుకుంటారు. యుద్ధరంగంలో శత్రువు మీదకు దాడికి వెళ్లడంకోసం ఆ గుర్రాన్ని ఎక్కినప్పుడు అది పరుగెత్తకపోతే దానిని కూడా వెంటనే వదిలివెయ్యాలి.
అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము,
జొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!
పద్య అర్థం: అప్పిచ్చేవాడు, వైద్యుడు, సమృద్ధిగా ఎప్పుడూ నీటితో పారే ఏరూ, ద్విజుడు, మొదలైనవాళ్ళుండే ఊళ్ళోనే ఉండాలి. అవి లేని వాళ్ళుండే ఊళ్ళో ఉండరాదు అని అర్థం.
ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!
పద్య అర్థం: మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ!
పద్య అర్థం: అప్పుచేసి చేయు వేడుకయు, ముసలితనమందు పడుచు పెండ్లామును, మూర్ఖుడు చేయు తపమును, తప్పు విచారింపని రాజు యొక్క రాజ్యమును – సహింపరానివై, తరువాత చెడును గలిగించును.
ఆకొన్నకూడె యమృతము
తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడె మనుజుడు
తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ
పద్య అర్థం: ఈ భూమి మీద బాగా ఆకలివేసినప్పుడు తిన్న అన్నమే అమృతం. అది చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దానం కోరితే విసుక్కోకుండా దానం చేసేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. అలాగే ఎప్పుడైనా కష్టాలు కలిగితే వాటిని ఓర్చుకోగలవాడే నిజమైన మానవుడు. ధైర్యం ఉన్నవాడే వంశానికి మంచి పేరు తేగలుగుతాడు.
ఇమ్ముగ జదువని నోరును
నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్
తమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
పద్య అర్థం: మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి. ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి. ఈ మూడు పనులనూసరిగా చేయని నోరు… కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది.