ధాశరథీ శతకం – Telugu Padyalu

ధాశరథీ శతకం

శ్రీరఘురామ! చారుతుల – సీదళదామ శమక్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజ – గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధ రాక్షస వి – రామ! జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ! భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ!

రామ విశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్థ్స వంశ కలశాంబుధిసోమ సురారిదోర్భలో
ద్దామ విరామ భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ!

హాలికునకున్ హలాగ్రమున నర్థము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలినఁమనోవికారియగు మర్త్యుని నన్నొఁడగూర్చి నీపయిన్
దలఁవు ఘటింపఁజేసితిని దాశరథీ కరుణాపయోనిధీ!

కొంజక తర్కవాదమను – గుద్దలిచేఁబరతత్వభూస్థలిన్
రంజిలఁద్రవ్వి కన్గొనని రామనిధానము నేఁడుభక్తిసి
ద్దాంజన మందు హస్తగత మయ్యె భళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ!

ఖరకరవంశజ విను మఖండిత భూతపిశాచ ఢాకినీ
జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ వి
స్పుర దురువజ్రపంజరముజొచ్చితి, నీయెడ దీన మానవో
ద్దార బిరుదాంక మేమఱకు దాశరథీ కరుణాపయోనిధీ!

జుఱ్ఱెద మీ కథామృతము జుఱ్ఱెద మీ పదకంజ తోయమున్
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే
జుఱ్ఱెద జుఱ్ఱుజుఱ్ఱఁగ రుచుల్ గనువారి పదంబు గూర్పవే
తఱ్ఱుల తోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ!

మామక పాతక వ్రజము మ్రాన్పనగణ్యము చిత్రగుప్తులే
యేమని వ్రాఁతురో? శమనుఁడేమి విధించునొ? కాలకింకర
స్తోమ మొనర్చుటేమొ? వినఁ జొప్పడ దింతకమొన్నె దీన చిం
తామణి యెట్లు గాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ!

దాచిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా? గుహుడు తావక దాస్య మొసంగినావు; నే
జేసిన పాపమా! వినుతి చేసినగావవు గావుమయ్య! నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ!

సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లులుబ్ధిమానవుల్
వీరపతివ్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహీ
భారముఁదాల్పఁగా జనులు పావనమైన పరోపకార స
త్కార మెఱుంగలే రకట దాశరథీ కరుణాపయోనిధీ!

వారిచరావతారమున వారధిలోఁజొషుబాఱిఁక్రోధవి
స్తారగుడైన యా నిగమ తస్కరవీర నిశాచరేంద్రునిన్
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహో
దారత నిచ్చి తీవెగ దాశరథీ కరుణాపయోనిధీ!

కర మనురక్తి మందరము గవ్వముగా, నహిరాజు ద్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్థపయోధి మథించుచున్నచో
ధరణి చలింప లోకములు తల్లడ మందఁగఁగూర్మమై ధరా
ధరము ధరించి తీవెకద దాశరథీ కరుణాపయోనిధీ!

చిరతరభక్తి నొక్కతుల సీదళ మర్పణ చేయుఁవాడు ఖే
చర గరు డోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్
స్పురదరవింద పాదముల బూజలొనర్చిన వారికెల్లద
త్పర మరచేతధాత్రిగద దాశరథీ కరుణాపయోనిధీ!

భానుఁడు తూర్పునందు గనుపట్టినఁబావక చంద్రతేజముల్
హీనత చెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నఁబరదైవ మారీచు లడంగకుండునే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ!

నీ మహనీయతత్త్వరస నిర్ణయబోధ కథామృతాబ్దిలో
దా మును గ్రుంకులాడక వృధా తను కష్టముజెంది మానవుం
డీ మహిలోక తీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
త్తామస పంకముల్ విడునె దాశరథీ కరుణాపయోనిధీ!

జనవర మీకథాళి విన సైపక కర్ణములందు ఘంటికా
నినద వినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు ని
న్ననయము నమ్మి కొల్చిన మహాత్మున కేమియొసంగెదో సనం
దననుత మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ!

పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వరాదులం
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవుఁదమ్ము డిరుపక్కియలన్ జానీ తద్విపత్తి సం
తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ!

భ్రమరము కీటకంబుఁగొని పాల్పడిఝాంకరణోపకారియై
భ్రమరముగా నొనర్చునని పల్కుటఁజేసి భవాదిదుఃఖసం
తమస మెడల్చి? భక్తిహితం బుగ జీవుని విశ్వరూప త
త్త్వము, నధరించుటే మరుదు దాశరథీ కరుణాపయోనిధీ!

By padyalu

Related Post