వేమన పద్యాలుఆ

ఆఁకటికి దొలంగు నాచార విధు లెల్ల

ఆఁకటికి దొలంగు నాచార విధు లెల్ల
చీఁకటికి దొలంగు చిత్తశుద్ధి
వేఁకటికిఁ దొలఁగు వెనుకటి బిగువెల్ల
విశ్వదాభిరామ వినర వేమ!

ఆఁకలన్నవాని కన్నంబు పెట్టిన

ఆఁకలన్నవాని కన్నంబు పెట్టిన
హరున కర్పితముగ నారగించు
ధరవిహీనునకును దానము నటువలె
విశ్వదాభిరామ వినర వేమ!

ఆఁడు దానిబొంకు గోడపెట్టినయట్టు

ఆఁడు దానిబొంకు గోడపెట్టినయట్టు
పురుషవరుని బొంకు పూలతడిక
స్త్రీలనేర్పులు భువి చీకు రాయితపము
విశ్వదాభిరామ వినర వేమ!

ఆకాశంబున వాయువు

ఆకాశంబున వాయువు
మ్రాకునదావాగ్ని యటుల మానసమందు
ఏకాకారుఁడు జగమున
జోకైతనుదానె వెల్గు సుమ్ముర వేమ!

ఆకు కానవచ్చు హరిహరాదులకును

ఆకు కానవచ్చు హరిహరాదులకును
కొమ్మ గానరాదు కోరిచూడ
కొమ్మగానరాగఁ గొనియాడ కుండురా
విశ్వదాభిరామ వినర వేమ!

ఆకు చాటునుండు నన్నిలోకంబులు

ఆకు చాటునుండు నన్నిలోకంబులు
కొమ్మ గానరాదు బ్రహ్మకైన
కొమ్మ గానఁబడినఁ గొనియాడవచ్చురా
విశ్వదాభిరామ వినర వేమ!

ఆకులెల్లఁదిన్న మేఁకపోతుల కేల

ఆకులెల్లఁదిన్న మేఁకపోతుల కేల
గాకపోవునయ్య కాయసిద్ధి
లోకులెల్ల వెఱ్ఱి పోకళ్ళఁ బోదురు
విశ్వదాభిరామ వినర వేమ!

ఆకృతి యనఁగను నిరాకృతి యనఁదగు

ఆకృతి యనఁగను నిరాకృతి యనఁదగు
నాకృతి నొగిఁదగు నిరాకృతిట్టు
లవియు రెండు లే యపురూపమై యుండు
విశ్వదాభిరామ వినర వేమ!

ఆడితప్పువార లభిమానహీనులు

ఆడితప్పువార లభిమానహీనులు
గో డెఱుఁగనివారు కొద్దివారు
కూడి కీడు సేయఁగ్రూరుండు తలపోయ
విశ్వదాభిరామ వినర వేమ!

ఆడు పాపజాతి యన్నిటికంటెను

ఆడు పాపజాతి యన్నిటికంటెను
ఆశచేత యతులు మోసపోరె
చూచి విడుచువారు శుద్ధాత్ములెందును
విశ్వదాభిరామ వినర వేమ!

ఆడు వారిఁ గన్న నర్థంబు పొడఁ గన్న

ఆడు వారిఁ గన్న నర్థంబు పొడఁ గన్న
సారమైన రుచుల చవులు గన్న;
నయ్యగాండ్ర కైన నాశలు బుట్టవా?
విశ్వదాభిరామ వినర వేమ!

ఆత్మ దేహమందు నతిసూక్ష్మముగఁ జూచి

ఆత్మ దేహమందు నతిసూక్ష్మముగఁ జూచి
దేహమాత్మయందుఁ దేటపరచి
యాత్మ నెందుఁ జూడ నతఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఆత్మబుద్ధివల్ల నఖిలంబు తానయ్యె

ఆత్మబుద్ధివల్ల నఖిలంబు తానయ్యె
జీవబుద్ధివలన జీవుఁడయ్యె
మోహబుద్ధినియము ముందరఁ గనుగొని
విశ్వదాభిరామ వినర వేమ!

ఆత్మయందు జ్యోతి యెఱుగుట లింగంబు

ఆత్మయందు జ్యోతి యెఱుగుట లింగంబు
తెలిసిచూడగాను తేటపడును
అదియు గురువులేక యబ్బునా తెలియంగ
విశ్వదాభిరామ వినర వేమ!

ఆత్మయందు ధ్యాస అమరదెందు

ఆత్మయందు ధ్యాస అమరదెందు విరక్తి
భీకరంబెగాని బిరుదులేదు
ఆలిరంకు తెలుప అఖిల యజ్ఞంబుల
విశ్వదాభిరామ వినురవేమ!

ఆత్మలోని జ్యోతి యమరుగ లింగంబు

ఆత్మలోని జ్యోతి యమరుగ లింగంబు
తెలిసిచూడకున్న తేటపడదు
అదియు గురువులేక అబ్బునా తెలియంగ
విశ్వదాభిరామ వినురవేమ!

ఆత్మలోన నాద మాలించి మాలించి

ఆత్మలోన నాద మాలించి మాలించి
యాసలందుఁ జిక్కఁ డాదియోగి
ఆత్మలోనికళల నంటినఁ దత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఆత్మలోని శివుని ననువుగా శోధించి

ఆత్మలోని శివుని ననువుగా శోధించి
నిశ్చలముగ భక్తి నిలిపెనేని
సర్వముక్తుడౌను సర్వంబుఁ దానౌను
విశ్వదాభిరామ వినర వేమ!

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండ శుద్ధి లేని పాకమది యేల
చిత్త శుద్ధి లేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినర వేమ!

భావం: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాటించడంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.

ఆది నొకటి దెలిసియాదిని మదినిల్పి

ఆది నొకటి దెలిసియాదిని మదినిల్పి
యాదిఁబాయకున్న నభవుఁ డవును
ఆదిఁ బాయువాఁడు నంధకు రీతిరా
విశ్వదాభిరామ వినర వేమ!

ఆపగాళివెంట నడవులవెంటను

ఆపగాళి వెంట అడవుల వెంటను
కొండరాళ్ళ వెంట గొడవ యేల
నుల్లమందె శివుఁడు ఉండుటఁ దెలియరు
విశ్వదాభిరామ వినర వేమ!

ఆపదందుఁ జూడు మారయ బంధుల

ఆపదందుఁ జూడు మారయ బంధుల
భయమువేళఁజూడు బంటుగుణము
పేదపడ్డ వెనుక పెండ్లము మతిఁజూడు
విశ్వదాభిరామ వినర వేమ!

ఆమడ కామడ కడవులు

ఆమడ కామడ కడవులు
గ్రామంబులు చెరువు నదులు కర్మము లింతే
తా మెందులోనఁ దిరిగిన
వేమన తోడగుచువచ్చు వెంటనె వేమా!

ఆర్తవిద్య లెల్ల యపకీర్తి పాలాయె

ఆర్తవిద్య లెల్ల యపకీర్తి పాలాయె
వార్త కెక్కునంత వారికైన
ఆర్తవిద్య లెల్ల ధూర్తులపాలాయె
విశ్వదాభిరామ వినర వేమ!

ఆరుమతములందు అధికమైనమతము

ఆరుమతములందు అధికమైనమతము
లింగమతముకన్న లేదుగాని
లింగదారకన్న దొంగలు లేరయా!
విశ్వదాభిరామ వినురవేమ!

ఆఱుగురిని జంపి హరిమీఁద ధ్యానంబు

ఆఱుగురిని జంపి హరిమీఁద ధ్యానంబు
నిలిపి నిశ్చలముగ నెగడి యాత్మ
నతని నొకనిఁ జేయ నాతఁడె యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!

ఆఱురుచులు వేఱు సారంబు నొక్కటి

ఆఱురుచులు వేఱు సారంబు నొక్కటి
సత్యనిష్ఠ వేఱు సత్యమొకటి
పరమఋషులు వేఱు భావ్యుఁ డొక్కండురా
విశ్వదాభిరామ వినర వేమ!

ఆఱువేషములను నటుచూడ బహువింత

ఆఱువేషములను నటుచూడ బహువింత
లాత్మయందు ధ్యాన మమర దెందు
భీకరంబె కాని బిరుదు లేదు విరక్తి
విశ్వదాభిరామ వినర వేమ!

ఆలి వంచలేక యధమత్వముననుండి

ఆలి వంచలేక యధమత్వముననుండి
వెనుక వంతుననుట వెఱ్ఱితనము
చెట్టుముదర నిచ్చి చిదిమినఁ బోవునా
విశ్వదాభిరామ వినర వేమ!

ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి

ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి
వేఱుపడెడువాఁడు వెఱ్ఱివాఁడు
కుక్కతోఁకఁ బట్టి గోదావ రీఁదునా
విశ్వదాభిరామ వినర వేమ!

ఆలిఱంకుఁ దెలుపు నఖిలయజ్ఞంబులు

ఆలిఱంకుఁ దెలుపు నఖిలయజ్ఞంబులు
తల్లిఱంకు తెలుపుఁ దద్దినములు
కానితెరువు కర్మ కాండ కల్పితమాయె
విశ్వదాభిరామ వినర వేమ!

ఆలివంకవార లాత్మబంధువు లైరి

ఆలివంకవార లాత్మబంధువు లైరి
తల్లివంకవారు తగినపాటి
తండ్రివంకవారు దాయాదులైరయా
విశ్వదాభిరామ వినర వేమ!

ఆలు పతిసౌఖ్యముల కిల

ఆలు పతిసౌఖ్యముల కిల
నాలయ మగునేని దానినా లన వచ్చున్
ఆలాగునఁ గాకుండిన
కాలునిపెనుదూత యదియ కదరా వేమా!

ఆలు బిడ్డలు ధన మరయఁ దల్లియుఁ దండ్రి

ఆలు బిడ్డలు ధన మరయఁ దల్లియుఁ దండ్రి
కలమనుజుఁడు మిగుల కష్టపడును
తనకు నెవరులేరు తాను బ్రహ్మముఁగన్న
విశ్వదాభిరామ వినర వేమ!

ఆలు మగనిమాట కడ్డంబు వచ్చెనా

ఆలు మగనిమాట కడ్డంబు వచ్చెనా
యాలుఁగా దది మరగాలు కాని
యట్టియాలు విడచి యడవి నుండుట మేలు
విశ్వదాభిరామ వినర వేమ!

ఆలు రంభయైన అతిశీలయైన

ఆలు రంభయైన అతిశీలవతియైన
జారపురుషుఁడేల జాడ మాను
మలముదినుట కుక్క మరగిన చందంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఆలు సుతులు ధనము లరయంగ మీరని

ఆలు సుతులు ధనము లరయంగ మీరని
మొనసి కర్మమునను మోసపోయి
కాలు గన్నయపుడు కడతేరజాలడు
విశ్వదాభిరామ వినురవేమ!

ఆలుబిడ్డ లనుచు నతిమోహమున నున్న

ఆలుబిడ్డ లనుచు నతిమోహమున నున్న
ధనముమీద వాంఛ తగిలియున్న
నట్టివానిముక్తి యవనిలో లేదయా
విశ్వదాభిరామ వినర వేమ!

ఆలురంభయైన అతిశీలవతియైన

ఆలురంభయైన అతిశీలవతియైన
జారపురుషుడేల జాడమాను
మాలవాడ కుక్క మఱగిన విడుచునా
విశ్వదాభిరామ వినురవేమ!

ఆశ లుడుగఁగాని పాశముక్తుఁడు గాఁడు

ఆశ లుడుగఁగాని పాశముక్తుఁడు గాఁడు
ముక్తుఁ డైనఁగాని మునియుఁగాఁడు
మునియు నయినఁగాని మోహంబు లుడుగవు
విశ్వదాభిరామ వినర వేమ!

ఆశ విడక గాని పాశముక్తుఁడు గాఁడు

ఆశ విడక గాని పాశముక్తుఁడు గాఁడు
ముక్తుఁడయినఁగాని మునియుఁగాఁడు
మునికిఁగాని సర్వమోహంబు లూడవు
విశ్వదాభిరామ వినర వేమ!

ఆశకన్న దుఃఖ మతిశయంబుగ లేదు

ఆశకన్న దుఃఖ మతిశయంబుగ లేదు
చూపు నిలుపకున్న సుఖము లేదు
మనసు నిల్పకున్న మఱి ముక్తి లేదయా
విశ్వదాభిరామ వినర వేమ!

ఆశచేత మనుజు లాయువుగలనాళ్లు

ఆశచేత మనుజు లాయువుగలనాళ్లు
దిరుగుచుంద్రు భ్రమను ద్రిప్పలేక
మురికిభాండమందు ముసరు నీఁగలభంగి
విశ్వదాభిరామ వినర వేమ!

ఆశలనెడు తాళ్ళ నమరఁ గోయగఁ జేసి

ఆశలనెడు తాళ్ళ నమరఁ గోయగఁ జేసి
పారవైవఁగాని పరములేదు
కొక్కు తిండియాసఁ జిక్కి చచ్చినయట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు

ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు
కట్టుపడుచు ముక్తిగానరైరి
జ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ!

ఆశయనెడు దాని గోసివేయగాలేక

ఆశయనెడు దాని గోసివేయగాలేక
మొహబుద్ది వలన మునుగువారు
కాశివాసులైన గనబోరు మోక్షము
విశ్వదాభిరామ వినుర వేమ!

ఆసనం బెఱుంగక యామర్మకర్మంబు

ఆసనం బెఱుంగక యామర్మకర్మంబు
గురువుచేతఁ దెలిసి కూర్పకున్న
మనసు నిలుపకున్న మఱిద్విజుం డెట్లగు
విశ్వదాభిరామ వినర వేమ!

ఆసనములు పన్ని యంగంబు బిగియించి

ఆసనములు పన్ని యంగంబు బిగియించి
యొడలు విఱుచుకొనెడి యోగమెల్ల
జెట్టిసాముకన్నఁ జింతాకు తక్కువ
విశ్వదాభిరామ వినర వేమ!

By padyalu

Related Post