వేమన పద్యాలుఒ

ఒక్కఁడు రోగి యాయె మఱియొక్కఁడు దిక్కులఁ ద్యాగి యాయె

ఒక్కఁడు రోగి యాయె మఱియొక్కఁడు దిక్కులఁ ద్యాగి యాయె
వేఱొక్కఁడు భోగి యాయెనటు నొక్కఁడు చక్కనియోగి యాయెఁ
దా నొక్కఁడు రాగియాయె నినుబోలు మహాత్మునిఁగాన మెచ్చట
నిక్కము నిన్నిరూపములు నీకును జెల్లుగదన్న వేమనా!

ఒక్కఘటములోనఁ బెక్కురూపులు నిల్చు

ఒక్కఘటములోనఁ బెక్కురూపులు నిల్చు
నెన్నియెన్నిరూపు లెసఁగుచుండు
నవియుఁదొలఁగెనేని యన్నియు బయలౌను
ఆత్మతత్వ మిట్టులౌర వేమా!

ఒక్కమనసుతోడ నున్నది సకలము

ఒక్కమనసుతోడ నున్నది సకలము
తిక్క బట్టి నరులు తెలియలేరు
తిక్క నెఱిఁగి నడువ నొక్కఁడే చాలురా
విశ్వదాభిరామ వినర వేమ!

ఒకటిక్రింద నొక్క డొనర లబ్ధముఁ బెట్టి

ఒకటిక్రింద నొక్క డొనర లబ్ధముఁ బెట్టి
వలనుగ గుణియింప వరుసఁ బెరుఁగు
నట్టిరీతి నుండు నౌదార్యఫలములు
విశ్వదాభిరామ వినర వేమ!

ఒకరి నోరుఁగొట్టి యొకరు భక్షింతురు

ఒకరి నోరుఁగొట్టి యొకరు భక్షింతురు
వారినోరు మిత్తి వరుసఁగొట్టు
చేఁపపిండు పిల్ల చేఁపలఁ జంపును
జనుఁడు చేఁపపిండుఁ జంపు వేమ!

ఒకరికీడు వేర ఒకరికి నియ్యడు

ఒకరికీడు వేర ఒకరికి నియ్యడు
యొకని మేలు వేర యొకరికీడు
కీడుమేలువారు పోడిమి తెలియరు
కాలుడెరుగు వారి గదరవేమ!

ఒడ్డుపొడుగుగల్గి గడ్డంబునిడుపైన

ఒడ్డుపొడుగుగల్గి గడ్డంబునిడుపైన
దానగుణములేక దాతయౌనె
యెనుము గొప్పదైన యేనుగున్ బోలునా?
విశ్వదాభిరామ వినురవేమ!

ఒడల భూతిఁ బూసి జడలు ధరించిన

ఒడల భూతిఁ బూసి జడలు ధరించిన
నొడయుఁడైన ముక్తిఁ బడయలేఁడు
తడకబిఱ్ఱుపెట్టఁ దలపుతో సరియౌనె
విశ్వదాభిరామ వినర వేమ!

ఒడలు బడలఁజేసి యోగుల మనువారు

ఒడలు బడలఁజేసి యోగుల మనువారు
మనసు కల్మషంబు మాన్పలేరు
పుట్టమీదఁ గొట్ట భుజగంబు చచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!

ఒడలుఁ బెంచులంజ యుబ్బకంబుననైన

ఒడలుఁ బెంచులంజ యుబ్బకంబుననైన
వేగ విటునిమీఁద విఱుఁగఁబడును
పందికొక్కుమీద బండికల్‌ పడ్డట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

ఒరులకొఱకు భూమి నొరసెటివారును

ఒరులకొఱకు భూమి నొరసెటివారును
అవనిపతికి వశ్యులయినవారు
పాలవంటివారు పన్ను పెట్టెడువారు
వాకెఱుంగరు శాఖవారు వేమా!

ఒల్ల నన్నఁ బోదు నొల్ల ననఁగరాదు

ఒల్ల నన్నఁ బోదు నొల్ల ననఁగరాదు
తొల్లి చేయునట్టి ధూర్తఫలము
ఉల్లమందు వగవకుండుట యోగ్యంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ఒల్లనిపతి నొల్లనిసతి

ఒల్లనిపతి నొల్లనిసతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడె
గొల్లండు గాక ధరలో
గొల్లనికిం గలవె వేఱె కొమ్ములు వేమా!

By padyalu

Related Post