వగవకు గడిచిన దానికి
బొగడకు దుర్మాతులనెపుడు పొసగని పనికై
యెగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!
తనుజులనుం గురువృద్ధుల
జననీజనకులను సాధుజనుల నెవడు దా
ఘనుడయ్యుబ్రోవడో యా
జనుడే జీవన్మృతుండు జగతి కుమారా!
సద్గోష్ఠి సరియు నొసగును
సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!
అవయవహీనుని సౌంద
ర్యవిహీను దరిద్రుని విద్య రానియతని సం
స్తవనీయు, దేవశృతులన్
భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా!
శ్రీ భామినీ మనోహరు
సౌభాగ్యదయాస్వభావు సారసనాభున్
లో భావించెద; నీకున్
వైభవము లోసంగుచుండ వసుధ కుమారా!
వృద్ధజన సేవ చేసిన,
బుద్ధి వివేషజ్ఞుఁడనుచుఁబూతచరితుఁడున్
సద్ధర్మశాలి యని బుధు
లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగ కుమారా!
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁజేయకు
మాచారము విడువఁబోకుమయ్య కుమారా!
పెద్దలు వద్దని చెప్పిన
పద్దులఁబోవంగరాదు పరకాంతల నే
ప్రొద్దే నెదఁబరికించుట
కుద్దేశింపంగఁగూడ దుర్వి కుమారా!
ధరణీనాయకు రాణియు
గురురాణియు నన్నరాణి కులకాంతను గ
న్నరమణి దను గన్నదియును
ధర నేవురు తల్లులనుచుఁదలఁపుఁ కుమారా!
పోషకుల మతముఁగనుఁగొని
భూషింపక కాని ముదముఁ బొందరు మఱియున్,
దోషముల నెంచుచుందురు,
దోషివయిన మిగులఁగీడు దోఁచుఁ కుమారా!
నరవరుఁడు నమ్మి తను నౌ
కరిలో నుంచునెడ వాని కార్యములందున్
సరిగా మెలంగ నేర్చిన
పురుషుడు లోకమునఁగీర్తి బొందు కుమారా!
చేయకుము కాని కార్యము;
పాయకుము మఱిన్ శుభం; బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబునఁ ;
గూయకు మొరుమనసు నొచ్చుఁ గూఁత కుమారా!
పిన్నల పెద్దలయెడఁ గడు
మన్ననచే మెలఁగు సుజన మార్గంబులు నీ
వెన్నుకొని తిరుగుచుండిన
నన్నియెడల నెన్నఁబడుదువన్న కుమారా!
పెద్దలు విచ్చేసినచో
బద్దకముననైన దుష్ట పద్ధతి నైనన్,
హద్దెఱిఁగి లేవకున్నన్
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!
ఉన్నను లేకున్నను పై
కెన్నఁడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ
కన్న తలిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁగుమారా!
తనపై దయ నూల్కొనఁగను
గొన నేతెంచినను శీల గురుమతులను వం
దనముగఁ బూజింపం దగు
మన మలరగ నిదియ విబుధ మతము కుమారా!
పుడమిని దుష్టత గలయా
తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడియౌ
నడవడి మిడి యందఱి వెం
బడి ద్రిప్పికొనుచును గీడు పఱుపకుఁబుత్రా!
పనులెన్ని కలిగియున్నను
దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై
వినఁగోరుము సత్కథలను
కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!
తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్నమాట సత్యమెఱుఁగుఁ నా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!