సుమతీ శతకం – Telugu Padyalu

శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
ధారాళమైన నీతులు
నోరూరఁగ జీవులు పుట్ట నుడివెద సుమతీ!

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ!

తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్
దలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జను లా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లుండును గొల్లఁడౌనె గుణమున సుమతీ!

మాటకు బ్రాణము సత్యము
కోటకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికి బ్రాణము మానము
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నకఁజేయువాడె నేర్పరి సుమతీ!

తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!

కొఱగాని కొడుకు పుట్టినఁ
కొఱగామియె కాదు తండ్రి గుణముల జెఱచున్
జెఱకు తుద వెన్ను పుట్టిన
జెఱకునఁ దీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ!

వినదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!

కూరిమిగల దినములలో
నేరములెన్నడును గలుగనేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండ నిక్కము సుమతీ!

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగఁజెఱువు నిండినఁ
గప్పలు పదివేలుఁజేరుఁగదరా సుమతీ!

అప్పిచ్చువాఁడు వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును,ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ!

అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యముఁ
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

కోమలి విశ్వాసంబున
బాములతోఁజెలిమి యన్య భామలవలపున్
వేముల తియ్యఁదనంబును
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ!

ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యడలం దా
నెత్తిచ్చి కఱిగిపోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!

అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దలఁగట్టుక
మడి దున్నుకబ్రతుకవచ్చు మహిలో సుమతీ!

చింతింపకు కడచినపని
కింతులు వలతురని నమ్మకెంతయు మదిలో
నంతఃపుర కాంతలతో
మంతనములు మాను మిదియె మతముర సుమతీ!

అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వర మీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁబారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయుఁగదరా సుమతీ!

తలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికి నిజములేదు వివరింపగాఁ
దల దడివి బాస జేఁసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ!

సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!

నమ్మకు సుంకరి, జూదరి,
నమ్మకు మగసాలివాని, నటు వెలయాలిన్,
నమ్మకు మంగడి వానిని,
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!

నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లి దండ్రి నాథులతోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

పగవల దెవ్వరితోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
దెగనాడవలదు సభలను
మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!

పనిచేయునెడల దాసియు
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్
దన భుక్తియెడలఁదల్లియు
యనఁదన కులకాంత యుండనగురా సుమతీ!

ఎప్పుడుఁదప్పులు వెదకెడు
నప్పురుషునిఁగొల్వఁగూడదదియెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!

ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభముఁ
జదువని యా నీచుకడకుఁజనకుర సుమతీ!

వరిపంట లేని యూరును
దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్,
ధరను బతిలేని గృహమును,
అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!

పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణమ్ము మగువ సిద్ధము సుమతీ!

లావుగలవాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!

ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

ఒకయూరికి నొక కరణము
నొకతీర్పరియైనఁగాక యొగిఁదరు చైనన్
గకవికలు గాక యుండునె
సకలంబున గొట్టువడక సహజము సుమతీ!

ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీఁద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుఁగలిమిలేమి వసుధను సుమతీ!

కరణము సాధై యున్నను
గరి మద ముడిఁగినను బాము గఱవకయున్నన్
ధరఁదేలు మీటకున్నను
గర మరుదుగ లెక్కఁగొనరు గదరా సుమతీ!

ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్
దనవారి కెంతకలిఁగిన
దనభాగ్యమె తనఁకుగాగ తథ్యము సుమతీ!

పెట్టిన దినములలోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినములఁగనకఁపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!

కమలములు నీటఁబాసినఁ
గమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్
దమ దమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

పొరుగునఁపగవాఁడుండిన
నిర వొందఁగ వ్రాతగాఁడు ఏలికయైనన్
ధరఁగాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!

కరణముల ననుసరింపక
విరసంబునఁదిన్న తిండి వికటించు జుమీ
యిరుసునఁగందెనఁబెట్టక
పరమేశ్వరుబండియైన బాఱదు సుమతీ!

బలవంతుఁడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీ!

మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలచుఁదఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁగీలూడినట్లు జరుగదు సుమతీ!

కులకాంత తోడ నెప్పుడుఁ
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!

రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించురాజు గొల్వకు
పాపపు దేశంబు సొరకు, పదిలము సుమతీ!

వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగసాలి పొందు, వెలమల చెలిమిన్
గలలోఁన గన్న కలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!

క. కాముకుఁడు దనిసి విడిచిన
కోమలిఁ బరవిటుడు గవయ గూడుట యెల్లన్
బ్రేమమునఁజెఱకుపిప్పికి
జీమలు వెస మూఁగినట్లు సిద్ధము సుమతీ!

పరసతి కూటమిఁగోరకు
పరధనముగల కాసపడకు పరునెంచకుమీ,
సరిగాని గోష్ఠి సేయకు,
సిరిచెడిఁజుట్టంబుకడకుఁజేరకు సుమతీ!

Recommended Articles